క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లో తెలుగు రాష్ట్రాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇద్ద‌రూ నిరంత‌ర స‌మీక్ష‌ల‌తో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే.. ఒక విష‌యంలో మాత్రం రెండు రాష్ట్రాల మ‌ధ్య తేడా ఉంది. తెలంగాణ‌లో సాధార‌ణంగా మ‌ర‌ణించిన వారి మృతదేహాల‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే.. కేసీఆర్ నిర్ణ‌యాన్ని కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నా మెజార్టీగా మాత్రం స‌మ‌ర్థిస్తున్నారు. చ‌నిపోయిన వారికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల్సి రావ‌డం వ‌ల్ల‌.. ప్ర‌తీ మృత‌దేహాన్ని మార్చురీకి తీసుకురావాల్సి వ‌స్తోంది. ఇదే మార్చురీలో క‌రోనాతో మృతి చెందిన వారి మృత‌దేహాల ప‌క్క‌నే ఉంచాల్సి వ‌స్తోంది.

 

ఈ క్రమంలో మార్చురీలు, వైద్య‌సిబ్బందిపై కూడా తీవ్ర‌మైన ఒత్తిడి పెర‌గుతుంది. అంతేగాకుండా.. కుటుంబ స‌భ్యుడిని కోల్పోయి తీవ్ర‌మైన మాన‌సిక బాధ‌లో కుటుంబ స‌భ్యులు అక్క‌డే రెండు మూడు రోజులు ఉండాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో వారు కూడా అనారోగ్యం బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలోనే చ‌నిపోయిన‌వారి మృతదేహాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు అవ‌స‌రం లేద‌ని సీఎం కేసీఆర్ చెప్పిఉంటార‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌ర్వాత ఆ కుటుంబ స‌భ్యుల‌కు ప‌రీక్ష‌లు చేస్తే స‌రిపోతుంద‌ని చెబుతున్నారు. అయితే.. ఏపీలో మాత్రం మృత‌దేహాల‌కు కూడా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ కూడా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాగే నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: