రైలు ప్ర‌యాణికులకు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. ప్రయాణికుల రైళ్లు మంగళవారం నుంచి మళ్లీ న‌డిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దేశంలోని వివిధ రాష్ర్టాల రాజధానులకు, ఢిల్లీకి మధ్య తిరిగే 15 మార్గాల్లో రైలు సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. ఈ మార్గాల్లో దిబ్రుగఢ్‌, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్‌, రాంచి, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్‌, ముంబై సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్ము తావి స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీకి ఆయా స్టేషన్లకు 15 చొప్పున ఇరువైపులా 30 రైళ్లు తిరుగనున్నాయి. ఇవన్నీ ఏసీ సర్వీసులే అని రైల్వేశాఖ పేర్కొంది. అలాగే.. వీటిలో సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్ చార్జీల‌కు‌ సమానమైన చార్జీలను వసూలు చేస్తామని, ఈ చార్జీలపై ఎటువంటి రాయితీలు ఉండబోవని కేంద్రం స్ప‌ష్టం చేసింది. రైళ్లలోని సీట్ల సంఖ్యకు సమానంగా పూర్తి సామర్థ్యంతో నడపుతానని పేర్కొంది.

 

నిర్ణీత రైల్వే స్టేషన్లలోనే ఆగే ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే రిజర్వేషన్‌ చేసుకోవాలని చెప్పింది. ప్రయాణికులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే నిబంధనల వివరాలు ఈ టికెట్లలో ఉంటాయని పేర్కొంది. నిర్దేశించిన నిబంధనలను ప్రయాణికులు తప్పక పాటించాలని సూచించింది. ప్రత్యేక రైళ్ల రాకపోకల సమయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నది. రైల్వే స్టేషన్లలోని టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లన్నీ మూసే ఉంటాయని, ప్ల్లాట్‌ఫాం టికెట్లు సహా ఎలాంటి టికెట్ల విక్రయాలు ఉండ‌వ‌ని కేంద్రం తెలిపింది. క్ర‌మంగా మిగ‌తా రైళ్ల‌ను కూడా న‌డిపిస్తామ‌ని పేర్కొంది. కాగా, కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 25 నుంచి ప్రయాణికుల రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: