తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గ‌డం లేదు. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక తెలంగాణ‌లో మొన్న‌టి వ‌ర‌కు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టే కనిపించింది. కానీ.. నిన్న ఒక్క‌సారిగా కేసులు పెరిగాయి. ఆదివారం మరో 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 నమోదుకాగా, మిగిలిన 7 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారివి కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఇప్పటివరకు కరోనా కేసులు 1,196కు చేరుకున్నాయి. ఇప్ప టివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, 751 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 415 మంది చికిత్స పొందుతున్నారని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. తాజా లెక్కలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 11 మందికి వలస వ్యక్తులకు కరోనా సోకినట్లయింది. వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణకు చెందినవారు. అలాగే.. గత 14 రోజులుగా అసలే కేసులు నమోదు కాని జిల్లాలు 24 ఉన్నాయి.  కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్లగొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్‌ అర్బన్, నిర్మల్‌ జిల్లాలు అందులో ఉన్నాయి.

 

అలాగే.. ఏపీలోనూ కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 8,666 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్‌ రేటు ఆదివారం 1.14 శాతంగా నమోదైంది. ఆదివారం కోవిడ్‌ నుంచి కోలుకుని 38 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 925కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసులు 1010 ఉన్నాయి.  కర్నూలు జిల్లాలో మరో మరణం సంభవించడంతో మొత్తం మరణాలు 45కి చేరాయి. ఇప్పటి దాకా మొత్తం 1,73,735 పరీక్షలు నిర్వహించగా రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,980కి చేరింది. క‌రోనా బారి నుంచి కోలుకుని కర్నూలు జిల్లా నుంచి 21 మంది, గుంటూరు జిల్లా నుంచి 8, కృష్ణా జిల్లా 3, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కరు చొప్పున డిశ్చార్జ్ అయిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: