ఇటీవ‌ల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో నిలిపివేసిన ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను జ‌మ్ముక‌శ్మీర్‌లో తిరిగి ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. 2జీ మొబైల్‌ డాటా సేవలు మంగ‌ళ‌వారం నుంచి అందుబాటులోకి వ‌స్తున్నాయి. అయితే పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో తప్ప కశ్మీర్‌లోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభమవుతాయని జ‌మ్ముక‌శ్మీర్‌ అధికారులు ప్రకటించారు. హిజ్‌బుల్‌ ముజాహిద్దిన్ టాప్ కమాండర్‌ రియాజ్‌ నైకూతోపాటు మరో ఉగ్రవాదిని ఈనెల‌ 6న పుల్వామాలో భద్రతా దళాలు మట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో అల్లర్లు చెల‌రేగే అవకాశం ఉందని గ్ర‌హించిన అధికారులు, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.

 

ప‌రిస్థితుల‌న్నీ అదుపులోకి రావ‌డంతో తిరిగి ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. గతేడాది జ‌మ్ముక‌శ్మీర్‌కు స్వ‌యంప్రప‌తిప‌త్తి క‌ల్పించే 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు త‌ర్వాత అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి అధికారులు జమ్ముకశ్మీర్‌లో 4జీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. 4జీ సేవ‌ల‌ను ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అయితే.. 4జీ సేవ‌ల‌ను పున‌రుద్ధ‌ర‌ణ కోసం ఉన్న‌త‌స్థాయి క‌మిటీ వేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిన్న‌ సుప్రీంకోర్టు ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: