ఎన్నికల్లో ఒక్క ఓటు సైతం ఎంతో కీలకమైంది.. ఆ ఒక్క ఓటుతో గెలిచినా గెలుపే.. ప్రత్యర్థిపై గెలుపు ఎంత బలం ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది.. తీరా ఆ ఎన్నిక చెల్లదంటే ఎంత నరకమో ఊహించలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం న్యాయ, విద్యాశాఖల మంత్రిగా ఉన్న భూపేంద్రసిన్హా చూడాసమా.  తాాజాగా గుజరాత్‌ హైకోర్టు మంగళవారం చారిత్రక తీర్పునిచ్చింది.   ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెలువరించడంతో గుజరాత్‌ బీజేపీకి గట్టి దెబ్బతగిలింది. చూడాసమా గుజరాత్‌లోని ధోల్కా నియోజకవర్గం నుంచి 2017 లో అసెంబ్లీకి  ఎన్నికయ్యారు.

 

తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి అశ్విన్‌ రాథోడ్‌పై కేవలం 327 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.  కాగా, రిటర్నింగ్‌ అధికారి, ధోల్కా డిప్యూటి  కలెక్టర్‌ లెక్కింపు ప్రక్రియను తారుమారు చేశారని, 429 పోస్టల్‌ బ్యాలెట్లను రద్దు చేశారని రాథోడ్‌ ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి చూడాసమా ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన గుజరాత్‌ హైకోర్టు చూడాసమా ఎన్నిక చెల్లదంటూ మంగళవారం నాడు తీర్పు వెలువరించింది.  ఇదిలా ఉంటే.. ఇప్పుడు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్‌ చేస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: