కరోనా వైర‌స్ కార‌ణంగా భార‌త దేశంలో మార్చి 25 నుంచి నిలిచిపోయిన విమానాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ నెల 18 నుంచి వైమానిక సేవలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నివేదిక అందజేసింది. ఈ సిఫారసుల మేరకు విమానాలు మళ్లీ ఆకాశమార్గం పట్టే అవకాశం ఉన్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై బుధవారం  అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు ప్రయాణికులు, సిబ్బంది, సంస్థలు ఎలా నడుచుకోవాలో సూచించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఇందుకోసం విమానయాన రంగ నిపుణులు, సంస్థలు, ప్రజాప్రతినిధులతో చర్చించింది. ఈ మేరకు రూపొందించిన ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌' (ఎస్‌వోపీ) ముసాయిదా విడుద‌ల చేసింది.

 

దీని ప్ర‌కారం.. రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. గుర్తింపు పొందిన ట్యాక్సీల్లోనే రావాలి. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలి. అందులో గ్రీన్‌ స్టేటస్‌ ఉండాలి. వెబ్‌ చెకిన్‌ సదుపాయం కూడా ఉంటుంది. విమానాశ్రయాల్లో ఇచ్చే పత్రాలను నింపాలి. ఇందులో గత 14 రోజుల్లో చేసిన ప్రయాణ వివరాలు, గత నెల రోజుల్లో క్వారంటైన్‌లో ఉన్నారా? వంటి ప్రశ్నలు ఉంటాయి. గత నెలరోజుల్లో క్వారంటైన్‌కు వెళ్లి వచ్చిన ప్రయాణికులను విమానాశ్రయంలోని సెక్యూరిటీ చెక్‌ పాయింట్‌ వద్దకు తీసుకెళ్లి పరీక్షిస్తారు. విమానం క్యాబిన్‌లోకి సామాన్లు తీసుకురావడంపై నిషేధం. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. విమానాశ్రయంలో, విమానంలో వస్తువులను, ఉపరితలాలను వీలైనంత తక్కువగా ముట్టుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: