ఏపీ సీఎం జగన్ గురువారం ఉదయం 11.30 గంటలకు కరోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌పై  సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్‌, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం3.30 గంటలకు దిశ చట్టం, డెడికేషన్‌ సెంటర్లపై సీఎం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 10 జిల్లాల్లో 50 శాతం మందికిపైగా కరోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సగటు రికవరీ రేటు 32.9 శాతం మాత్రమే ఉంటే అది  రాష్ట్రంలో 53.44 శాతంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,137 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా  అందులో 1,142 మంది కోలుకున్నారు.

 

దీంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న కేసుల సంఖ్య 948కి తగ్గిపోయింది. ప్రకాశం జిల్లాలో బుధవారం నాటికి 63 మందికి కరోనా వైరస్‌ సోకితే అందులో 60 మంది కోలుకున్నారు. దీంతో ఆ జిల్లా 95.23 శాతం రికవరీ రేటుతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యధిక కేసులు నమోదైన కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా రికవరీ రేటు 50 శాతం మించి ఉండటం విశేషం. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 47కు చేరింది. క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: