లాక్‌డౌన్ కార‌ణంగా వ‌ల‌స కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు తినేందుకు తిండ‌లేక‌.. ఉండేందుకు నీడ‌లేక అల్లాడిపోతున్నారు. ఈ ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో సొంతూళ్ల‌కు కాలిన‌డ‌క‌న బ‌య‌లుదేరుతున్నారు. మండుటెండ‌ను, చిమ్మ‌చీక‌టిని లెక్క‌చేయ‌కుండా వంద‌ల కిలోమీట‌ర్లను సైతం లెక్క‌చేయ‌కుండా న‌డుస్తున్నారు. మ‌రికొంద‌రు కార్మికులు ఏదైనా వాహ‌నం దొరికితే అందులో వెళ్తున్నారు. ఈక్ర‌మంలో ఇంటికి చేరుకోకుండానే ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్ర‌మాదాల బారిన ప‌డి కొంద‌రు, న‌డ‌వ‌లేక తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై మ‌రికొంద‌రు మృతి చెందుతున్నారు.

 

మొన్న‌టి నుంచి వ‌ల‌స కార్మికుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా శ్రామిక్‌రైళ్ల‌ను న‌డుపుతున్నా.. వ‌ల‌స కార్మికుల కాలిన‌డ‌క మాత్రం ఆగ‌డం లేదు. రైళ్ల‌లో అవ‌కాశం ద‌క్క‌ని కార్మికులు కాలిన‌డ‌కన‌, ఇత‌ర వాహ‌నాల్లో సొంతూళ్ల‌కు వెళ్తున్నారు. తాజాగా.. ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎంతో సంతోషంగా మ‌హారాష్ట్ర నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వారి స్వ‌స్థ‌లాల‌కు ఓ ట్ర‌క్కులో బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గుణాలో బుధ‌వారం రాత్రి వారు ప్ర‌యాణిస్తున్న ట్ర‌క్కును బ‌స్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏకంగా ఎనిమిది మంది కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు. సుమారు 50మంది కార్మికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు వెంట‌నే గాయ‌ప‌డిన వారిని జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: