కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషలవుతారు.. కృషితో నాస్తి దుర్భిక్షం.. ఇలా కష్టపడి కృషి చేస్తే ఏదైనా సాధించవొచ్చు అని ఇప్పటి వరకు ఎంతో మంది నిరూపించారు.  కటిక పేదరికం ఉన్నా కష్టపడి చదివి డాక్టర్లు, శాస్త్రవేత్లు, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వారు ఉన్నారు. తాజాగా బీహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 15.29 లక్షల మంది పరీక్షలకు హాజరుకాగా, 80.59 శాతం... అంటే 12.40 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం రోహ్ తాస్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి కుమారుడు హిమాన్షు రాజ్ టాపర్ గా నిలిచాడని పేర్కొన్నారు. 

 

ఎంతో పేదరికంలో ఉన్నా.. హిమాన్షు రాజ్ కష్టపడి చదివి టాప్ ర్యాంక్ సాధించాడు. తనౌజ్ లోని జనతా హైస్కూల్ లో విద్యను అభ్యసించిన హిమాన్షుకు 482 మార్కులు వచ్చాయని తెలిపారు. కాగా, తాను తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తూనే, రోజుకు 14 గంటల పాటు చదివానని, భవిష్యత్తులో ఇంజనీర్ కావాలన్నదే తన లక్ష్యమని హిమాన్షు వ్యాఖ్యానించాడు.

 

తమ కుమారుడు తమ కష్టాల్లో పాలు పంచుకుంటూనే కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు తల్లిదండ్రులు. చిన్నతనం నుంచే హిమాన్షు కష్టపడి చదివేవాడని, ఆటల్లోనూ సత్తా చాటేవాడని, అతని టీచర్ వ్యాఖ్యానించారు. తమ గ్రామానికి చెందిన విద్యార్థి ఇలా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలవడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. పలువురు గ్రామస్థులు హిమాన్షు ఇంటికి వచ్చి మిఠాయిలు పంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: