మనిషి ప్రాణాలు ఎంతో విలువైనవి.. అందుకే  తమ స్థాయి కాకున్నా.. ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పు చేసైనా ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంది.. ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు.. మరికొంత మంది మృత్యువుతో పోరాడుతున్నారు.  అయితే కొంత మంది మాత్రం తమ ప్రాణాలకు విలువ లేదన్నట్టుగా ప్రవర్థిస్తున్నారు.. మత్తు కోసం చివరికి తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేశారు. దాంతో కోట్ల మంది మద్యం బాబులు చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు.. మద్యానికి ప్రత్యామ్నాయంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. 

 

తాజాగా విశాఖపట్టణం జిల్లాలో దారుణం జరిగింది. మత్తు కోసం స్పిరిట్ తాగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. జిల్లాలోని కశింకోటకు చెందిన ఐదుగురు వ్యక్తులు శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. వీరిలో ఒకరు ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి వస్తూవస్తూ రహస్యంగా సర్జికల్ స్పిరిట్ తీసుకొచ్చాడు. మత్తు ఎక్కువగా ఇస్తుందన్న ఉద్దేశంతో పార్టీలో వారు ఆ స్పిరిట్‌ను తలా కొంత తాగారు.

 

అది కాస్త బెడిసి కొట్టింది.. పార్టీ చేసుకున్న ఐదుగురిలో కునిశెట్టి ఆనంద్ (55), వడిశల నూకరాజు (61), పెతకంశెట్టి అప్పారావు (50)లు ఆదివారం ఉదయం కడుపునొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మరణించారు.. స్పిరిట్ తాగిన వారిలో మిగతా ఇద్దరు.. మాణిక్యం, దొరబాబులు ఈ ఉదయం కేజీహెచ్‌లో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: