ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా బాధితుల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి రూ.300 కోట్ల పైచిలుకు నిధులు వ్యయం చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 14న రాష్ట్రంలో తొలికేసు నమోదైన నాటినుంచి ఇప్పటివరకూ అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించారు. ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు, ఎన్‌95 మాస్కులు, పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌)లు భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. ఇవన్నీ ఒకెత్తయితే రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కోసం ఐసొలేషన్‌ వార్డులు సిద్ధం చేయ‌డం గ‌మ‌నార్హం.

 

అంతేగాకుండా.. 5 రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రులు, 13 జిల్లా కోవిడ్‌ ఆస్పత్రుల్లో పడకలు పెంచారు. కరోనా సోకిన నాటికి రాష్ట్రంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ (తిరుపతి) ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఖ్య 14కు చేరింది. ఒక్కో ల్యాబొరేటరీకి రూ.4 కోట్లు వ్యయం చేసి కొత్తగా ఏర్పాటు చేశారు. అంతేకాదు 100 వెంటిలేటర్లు పైగా కొనుగోలు చేశారు. వీటన్నిటికి రూ.300 కోట్లు వ్యయం కాగా జాతీయ ఆరోగ్యమిషన్‌ రూ.200 కోట్లు ఇచ్చింది.  ఈ నేప‌థ్యంలోనే ఏపీ స‌ర్కార్ క‌రోనా నియంత్ర‌ణ‌కు వేగ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: