ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభ‌మ‌య్యాయి. గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూషన్‌ హరిచందన్ ప్ర‌సంగంలో ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యేడాది పాల‌న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. యేడాది కాలంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసింద‌ని మెచ్చుకున్న గ‌వ‌ర్న‌ర్ ఈ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంతో ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్న గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌సాయ రంగంలో 8 శాతం వృద్ధిరేటు సాధించినట్ట తెలిపారు.

 

ఇక పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి రేటుతో పాటు ఎన్నికల హామీలో ఇవ్వని 40శాతం పథకాలను సైతం విజయవంతగా అమలు చేస్తున్నార‌ని కొనియాడారు. గ‌తేడాది కాలంలోనే మొత్తం ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా 3.98 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారు. గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి. 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చారు. 39 హామీలు పరిశీలనలో ఉన్నాయ‌ని గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు.

 

అలాగే మేనిఫెస్టోలో చెప్ప‌ని 40 హామీల‌ను నెర‌వేర్చిన‌ట్టు చెప్పిన గ‌వ‌ర్న‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌థ‌కాల‌కు గాను రు. 42 వేల కోట్లు ఖ‌ర్చు చేశార‌ని... దీని ద్వారా 3.98 కోట్ల మందికి లబ్ధి క‌లిగింద‌న్నారు.  మనబడి కార్యక్రమం కింద.. మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తామ‌ని..  ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింద‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: