తెలంగాణలో కరోనా కేసులు నిన్న రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.   నిన్న మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. 4,073 మందికి నెగటివ్‌గా నిర్ధారణ అయింది. గత మూడు రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా నిన్న మాత్రం ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు అంటే 87.6 శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డా.జీ.శ్రీనివాసరావు ప్రకటించారు.

 

రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు వేల మందికిపైగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 12 వేల మందికి పైగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి గాంధీ దవాఖానలో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా గరిష్టంగా ఉందని అన్నారు. ఇక కరోనా బాధితుల కోసం నాలుగు దవాఖానల్లో 2501 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

 

నేచర్‌ క్యూర్‌, ఆయుర్వేద ఆస్పత్రుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. వెయ్యి మందికిపైగా ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. అవసరమైన వారికి టెలిమెడిసిన్‌ సేవలు, వీడియో కాల్‌ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: