కరోనా నిర్ధారణ పరీక్షల కోసం అమెరికా శాస్త్రవేత్తలు చౌకైన, విద్యుత్‌ అవసరం లేని ఒక సెంట్రిఫ్యూజ్‌ను కనిపెట్టారు. పేద దేశాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల లభ్యతను పెంచడానికి ఇది వీలు కల్పిస్తుందని అన్నారు. ఈ పరిశోధన బృందానికి భారత సంతతి శాస్త్రవేత్త మను ప్రకాశ్‌ నేతృత్వం వహించారు.లాలాజల పరీక్ష ద్వారా కరోనా నిర్ధారణకు కొన్ని అవరోధాలు ఉన్నాయి. పరీక్షలో ఉపయోగపడే రియేజెంట్లను అడ్డుకునే కొన్ని పదార్థాలు లాలాజలంలో ఉన్నాయి.

 

 ఈ ఇబ్బందిని అధిగమించాలంటే రోగి నమూనాను సెంట్రిఫ్యుగేషన్‌ చేయాలి. తద్వారా సదరు పదార్థాలను వేరు చేయడానికి వీలవుతుంది. అయితే ఈ ప్రక్రియ కోసం నిమిషానికి రెండువేల భ్రమణాల సామర్థ్యం కలిగిన సెంట్రిఫ్యూజ్‌ అవసరం. దాని ఖరీదు చాలా ఎక్కువ. పైగా దానికి విద్యుత్‌ కూడా అవసరం.ఈ ఇబ్బందులను అధిగమించడానికి తాము ‘హ్యాండీఫ్యూజ్‌’ను తయారుచేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. అందులోని గొట్టాల్లో రోగి నమూనాలను ఉంచి, అత్యంత వేగంగా భ్రమణానికి గురిచేయవచ్చు. ఇందుకు విద్యుత్‌ అవసరం ఉండదు. 
 


ఈ భ్రమణ ప్రక్రియ వల్ల ఆ నమూనాల నుంచి వైరస్‌ జన్యువు వేరవుతుంది. ఫలితంగా ల్యాబ్‌లోని టెక్నిషియన్లు.. ‘ల్యాంప్‌ అసే’ అనే చౌకైన విధానం ద్వారా బాధితుల లాలాజల నమూనాల్లో కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించడానికి వీలు కలుగుతుంది. 'ఈ ల్యాంప్‌ ప్రక్రియ చాలా సులువైంది. ప్రత్యేక సాధనాలు అవసరం లేదు. గంట కన్నా తక్కువ సమయంలోనే పరీక్ష ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఒక్కో పరీక్షకు దాదాపు ఒక డాలర్‌ ఖర్చవుతుంది' అని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: