అమరావతి: ఏపీ ప్రజలు భారీ స్థాయిలో 151 సీట్లలో గెలిపించి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు చెత్త పాలనకు విముక్తి పలుకుతూ ప్రజలు జగన్ ను గెలిపించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పాలన నడుస్తుందా లేక టీడీపీ పాలన నడుస్తుందా అన్న విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ టీడీపీ అధికార పార్టీకి అడ్డు తగులుతోంది. ఏం చేసినా అవి ప్రజల వరకు వెళ్లకుండానే ఆగిపోతున్నాయి. న్యాయవ్యవస్థలో తన మనుషులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తున్నారు. అదీ కాకుండా నిమ్మగడ్డ వ్యవహారం చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు పాలనే నడుస్తుందా అని అనక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా పదుల సంఖ్యలో ఉన్న సమయంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తోంటే కరోనా కారణంగా ఆయన ఎన్నికలను వాయిదా వేయించేశారు. కరోనా వల్ల ప్రాణాలకే ముప్పు ఉందంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. అదే సమయంలో టీడీపీ కూడా నిమ్మగడ్డ కు వత్తాసు పలికింది. ఇక కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు హాని కలగకూడదని జగన్ ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ వాయిదా అంశానికి మద్దతు పలికారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది.

తూ.గో. జిల్లాలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలియంది కాదు. ప్రభుత్వం సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొంటోంది. అయినప్పటికి లాక్ డౌన్ లేకపోవడంతో ప్రజలు ఇంతకుముందు తిరిగినట్టే తిరిగేస్తున్నారు. దీంతో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఇక ఈ విషయం ఇలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలంటూ నిమ్మగడ్డ కొత్త రాగాన్ని అందుకున్నారు. అప్పుడేమో పదుల సంఖ్యలో ఉన్నప్పుడు కరోనా వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు అని చెప్పిన ఇదే మనిషి ఇప్పుడు నాలుక మడతేసి ఎన్నికలను నిర్వహించాలంటూ కోర్టును ఆశ్రయించారు. పైగా ఈయన కోర్టుకు ఏం చెప్పుకొచ్చారంటే.. బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయని.. కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికలను నిర్వహించాలని చెప్పుకొచ్చారు. బీహార్ లో జరిగేవి శాసనసభ ఎన్నికలు.. అక్కడ ప్రభుత్వ పనికాలం తీరిపోయింది. ఈ కారణం చేత అక్కడి ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమైంది. ఏపీలో పరిస్థితి అలాంటిది కాదు. ఇక్కడ జరగాల్సినవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు. అవి జరగకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. ఈరోజు కాకపోతే తరువాత ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు.

కానీ.. నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక్కడ విశేషమేంటంటే.. అప్పుడు నిమ్మగడ్డకు తెలుగుదేశం ఏ విధంగా మద్దతు పలికిందో ఇప్పుడు మళ్లీ అదే విధంగా వత్తాసు పలుకుతోంది. అసలు ఇప్పుడు వీరిద్దరూ ఎన్నికలు నిర్వహించమని ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? ఎందుకంటే.. ఏప్రిల్ నెలలో నిమ్మగడ్డ పదవీకాలం తీరిపోనుంది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈలోపే ఎలానైనా ఎన్నికలు జరిగితే తాము కర్రపెత్తనం చేయించవచ్చు అని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో తన పంతం నిలబెట్టుకోవాలని నిమ్మగడ్డ అనుకుంటున్నారు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఇక్కడ ఏ అధికారం లేదా? ప్రజలు చీ కొట్టిన చంద్రబాబు ఇక్కడ పెత్తనం చలాయించడం ఏంటి? 23 సీట్లతో ప్రజలు చీ కొట్టినా చంద్రబాబు మళ్లీ ఏదో విధంగా ప్రజలకు హాని కలిగించాలని చూస్తున్నారు. తనను ఓడించిన ప్రజలపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నట్టు కనపడుతోంది. ప్రజలు అన్నిటిని గమనిస్తూనే ఉన్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: