ఏపీ అధికార ప్రభుత్వం పై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ది తుగ్లక్ పాలన అని ఈ ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు. అమరావతి రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్లినందుకు నిరసనగా గుంటూరు జిల్లా జైలు వద్ద జరిగిన ఆందోళనలో పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీ యొక్క అహంకారం పరాకాష్ఠకు చేరిందని ఆయన ఘాటుగా విమర్శించారు..  దళితుల రక్షణ కోసం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వారిపైనే ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు.

కేసు పెట్టిన వ్యక్తి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నా.. పోలీసులు రైతులను అరెస్ట్‌ చేయడం జగన్ పాలనలో మాత్రమే సాధ్యమని ఆయన విమర్శించారు. తనకు ఓట్లు వేసిన దళితులపై జగన్‌ పగతీర్చుకుంటున్నారని ఆనందబాబు వ్యాఖ్యానించారు. అసలు దళితులు అంటే జగన్ కు కోపం అని దళితులకు అండగా ఉంటామని దళితులనే చిన్న చూపు చూస్తూ వారిని హింసించడం జగన్ పాలనలో సర్వసాధారణమని ఘాటుగా విమర్శించారు. గుంటూరు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమం ఒక కులానికి సంబంధించినదని ప్రచారం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎస్సీలు, బీసీలను ఎందుకు అరెస్ట్ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజధానికి భూములిచ్చిన రైతులు కడుపు మండి పోరాటం చేస్తుంటే వారికి పోటీగా అధికార పార్టీ నేతలు పోటీ ఆందోళనలు చేయటాన్ని తప్పుబట్టారు. రైతుల అరెస్టుపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి ఉద్యమం పట్ల ప్రభుత్వ అణచివేత పరాకాష్ఠకు చేరిందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపైనే ఎస్సీ వేధింపుల చట్టం కింద కేసులు పెట్టడం దేశంలోనే మొదటిసారని చెప్పారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: