తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం మరొక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని తీసుకురానుంది. దీనికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్‌ వాహనాల నూతన విధానం అద్భుతంగా విజయవంతం కాబోతుందని.. ఈ వాహనాలకు హబ్‌గా తెలంగాణను మార్చబోతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన విధానాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల శిఖరాగ్ర సదస్సులో మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ విడుదల చేశారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తృతికి సహకారం, భాగస్వామ్యం అనే వివిధ రకాల అంశాలపై ఈ యొక్క సదస్సులో చర్చించారు. ఈ యొక్క సదస్సులో మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం తెలిసిందే.అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయని అన్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

ఈ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో భూములు అందుబాటులో ఉన్నాయని.. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ అందుబాటులో ఉందని.. సరిగా వినియోగించుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్‌ విధానం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను భవిష్యత్‌లో మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేటీఆర్‌ వివరించారు. మరి కేటీఆర్ తెలిపిన విధంగా ఎలక్ట్రిక్ వాహనాల విధానం తెలంగాణలో ఎంతవరకు సత్ఫలితాలను అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: