‘నివర్’ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. అతి తీవ్రమైన తుఫానుగా పరిగణిస్తున్న ‘నివర్’ తమిళనాడు వైపుకు వేగంగా వస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం లేదా గురువారం తెల్లవారు జామున తమిళనాడులోని మమ్మళ్లపురం, కరైకల్ ప్రాంతాల మధ్య ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఇండియన్ మెటియరాలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. నివర్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో చెన్నై మహానగరం తడిసి ముద్దవుతోంది. కాగా, నివర్‌ను తట్టుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అన్నీ సిద్దం చేసుకుంది. అధికారులు అన్ని రకాలుగా తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాలకు సహాయం అందించేందుకు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం కూడా తుఫాన్ వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలను సాధ్యమైనంత తగ్గించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. సీఏం పళనిస్వామి ఇప్పటికే చాలా చోట్ల గురువారం నాడు ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు. ఈ జాబితాలో తమిళనాడు రాజధాని నగరం చెన్నైతో పాటు వెల్లూర్, కడలూర్, నాగపట్టనమ్, తిరువారూర్, చెంగల్‌పేట్, కాంచీపురం ఉన్నాయి.

ఇదే సమయంలో తుఫాన్ నుంచి ప్రజలను రక్షించడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్) కూడా ప్రకటించింది. ‘నివర్ తుఫాన్ అతి తీవ్రమైందని ఐఎమ్‌డీ స్పష్టం చేసింది. ఈ తుఫాను వల్ల ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దీని కోసం అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. గత రెండు రోజులుగా మా బృందాలు క్షేత్ర స్థాయిలో దగ్గరుండి అనేక ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరీ ప్రాంతాల్లో మొత్తం 25 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. అవన్నీ తుఫాన్ నష్టాలను తగ్గించేందుకే పనిచేస్తున్నాయి ’అని ఎన్‌డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ వివరించారు. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి 30 వేల మంది, పుదుచ్చేరి నుంచి ఓ 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: