న్యూఢిల్లీ: దేశంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో వాహన కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. రాజధాని ఢిల్లీలో అయితే ప్రమాదకర స్థాయిలో తీవ్ర రూపం దాల్చింది. సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. దీంతో కేంద్రం ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం ఓ కొత్త ప్రతిపాదన సిద్ధం చేస్తోంది.

కొత్త ప్రతిపాదనల్లో భాగంగా పీయూసీ సర్టిఫికేట్లు లేని వాహనాలపై కొరడా ఝుళిపించనుంది. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని నిబంధనను తెచ్చేందుకు రెడీ కానుంది. దీనికోసం కేంద్రం సరికొత్త విధివిధానాలను రూపొందించిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా నవంబర్ 27ను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను కోరింది. ఒకవేళ కేంద్రం దీనిపై వేగంగా ముందుకెళితే వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ఈ చట్టం అమల్లోకి రావచ్చని తెలుస్తోంది.

కొత్త చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ వెహికల్‌కు సంబంధించిన పీయూసీ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వారి మొబైల్ నెంబర్ల‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు(ఓటీపీ) కూడా జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటీపీ రాకపోతే పీయూసీ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ సాధ్యపడదని తెలుస్తోంది. సమాచార భద్రత దృష్ట్యా కేంద్రం ఈ విధానానికి మొగ్గు చూపింది.

ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ప్రజలకు 7 రోజులు గడువునిస్తారు. ఈ గడువులోగా సరైన పీయూసీ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత పీయూసీ సర్టిపికెట్లు లేని వాహనాల ఆర్‌సీ‌ సర్టిఫికేట్లను పోలీసులు సీజ్ చేస్తారు. కమర్షియల్ వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తించేలా కేంద్రం కసరత్తు చేస్తోందనేది సమాచారం.

ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దీనివల్ ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. ప్రధానంగా రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రతి ఏటా చలికాలంలో ఢిల్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. నగరంలోని కాలుష్య స్థాయిలను తెలిపే ఎయిర్ క్వాలటీ సూచి(ఏక్యూఐ) నానాటికీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కాలుష్యం పెరుగుతండడంతో గాలి వేగం కూడా తగ్గిపోతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: