బీజింగ్: కరోనా పుట్టిల్లు చైనా అన్న విషయం మనందరికీ తెలుసు. చైనాలోని వెట్ మార్కెట్లో ఈ వైరస్ మొదటగా పుట్టిందని ప్రపంచంలోని ఎన్నో దేశాలు కోడై కూస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అయితే మరో అడుగు ముందుకేసి చైనా ల్యాబుల్లోనే కరోనా వైరస్ పుట్టిందంటూ సంచలన ఆరోపణలు కూడా చేసింది. అయితే చైనా మాత్రం దీనికి ససేమిరా అంటూ వస్తోంది. వైరస్ అసలు తమ దేశంలోనే పుట్టలేదని వాదిస్తూ వస్తోంది.


ఇటీవల చైనా దిగుమతి చేసుకున్న ఆహార వస్తువుల్లో కరోనా వైరస్ బయటపడడంటో చైనా పక్కదేశాలవైపు వేలెత్తి చూపడం మొదలెట్టింది. 2019 లోనే కరోనా వైరస్ అనేక దేశాల్లో బయటపడిందంటూ వాదించింది. కరోనా వైరస్ నెపాన్ని మొదట ఇటలీపై, ఆ తరువాత అమెరికా, యూరప్ దేశాలపై నెట్టేందుకూ ప్రయత్నించింది. కానీ అందుకు సరైన ఆధారాలను మాత్రం ఇప్పటివరకూ చూపించలేకపోయింది. అయితే ఇప్పుడు ఓ సరికొత్త వాదనకు చైనా ప్రభుత్వం, అక్కడి శాస్త్రవేత్తలు వినిపిస్తున్నారు. అదేంటంటే కరోనా వైరస్ భారత్‌లో పుట్టిందట.


భారత్-చైనాల సరిహద్దుల వద్ద గత 5 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాయి. ఎముకలు సైతం గడ్డకట్టించే చలిలోనూ తూర్పు లద్దాఖ్‌ ఇరుదేశాల సైనికులూ గస్తీ కాస్తూనే ఉన్నారు. దీనికి తోడు భూటాన్‌లోని డోక్లామ్‌ వద్ద చైనా మళ్లీ తోకజాడిస్తోంది. గతంలో ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతానికి కేవలం 9 కిలోమీటర్ల ఏకంగా ఓ చిన్న గ్రామాన్నే ఏర్పాటు చేసింది. ఆయుధ బంకర్లు నిర్మించింది. సైన్యాన్ని మోహరిస్తోంది. భారత్‌తో యుద్ధమే వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ఏర్పాట్లనూ చేసుకుంటోంది. వీటి ద్వారా భారత్‌ను భయపెట్టాలని, తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది.

తాజాగా చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి కరోనా మహమ్మారికి భారత దేశమే కారణమంటూ వింత వాదనకు తెరతీశారు. వారి వాదన ప్రకారం.. చైనాలో బయటపడిన వైరస్ కరోనా వైరస్ కాదట. వాస్తవానికి ఈ మహమ్మారి భారత్‌లోనే పుట్టిందట. 2019 వేసవిలో ఈ వైరస్ ఆవిర్భవించిందని, ఆ తరువాత.. జంతువులకు, అవి తాగిన నీటినే మనుషులు కూడా తాగడం వల్ల వారికి కూడా పాకిందని ఓ సినిమా కథను చెబుతున్నారు. దీనికి అక్కడి మీడియా సైతం భారీగా పబ్లిసిటీ ఇస్తోంది.

భారత్‌లోని అరకొర వైద్య వసతులు, యువ జనాభా కారణంగా ఈ వైరస్ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపించదని అంటున్నారు. ఇప్పటివరకూ గుర్తించిన వైరస్ స్టెయిన్ల జన్యుక్రమం విశ్లేషించడం ద్వారా ఈ విషయం వెల్లడైందని చైనీస్ సైంటిస్టులు చెబుతున్నారు. అయితే.. ఈ విచిత్రమైన వాదనకు ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలూ మద్దతు తెలియజేయలేదు. కనీసం దీనిపై స్పందించడానికి వారు విముఖత చూపారంటే చైనా ఆరోపణలకున్న విలువేంటో అర్థం చేసుకోవచ్చు.


భారత్‌పై చైనా చేస్తున్న ఆరోపణలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. కరోనా వైరస్ చైనాలో పుట్టలేదని చెప్పడం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అసాధ్యమని  డబ్ల్యూహెచ్‌వో తేల్చి చెప్పేసింది. డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ కార్యక్రమాల చీఫ్ మైక్ రయాన్ మాట్లాడుతూ, చైనా వాదనలన్ని అభూతకల్పనలని, ఇప్పటికైతే కరోనా వైరస్ చైనాలో పుట్టిందనే విషయాన్నే నమ్ముతున్నామని చెప్పకనే చెప్పారు. మరి ఇప్పుడు చైనా ఇంకెలాంటి పన్నాగాలు పన్నుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: