చెన్నై: పార్టీ స్థాపించబోతున్నట్లు రజినీ చేసిన ప్రకటనపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. రజినీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా.. రారా అన్న సందేహాలకు తాజా ప్రకటనతో తెరపడిందని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌లో  పేర్కొన్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పోటీ రజినీ-శశికళ మధ్యే ఉండనుందని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

రజినీ తాజా నిర్ణయంతో బీజేపీ కొంత షాక్ తిన్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీపై రజినీ చేసిన ట్వీట్ తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, జనవరిలో ఆవిర్భవించబోతున్న తన పార్టీకి సంబంధించి డిసెంబర్ 31న ప్రకటన చేయనున్నట్లు రజినీకాంత్ ట్వీట్ చేయడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయని, అక్కడి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయని అన్నారు. రజినీ రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు ప్రస్తుతం స్పష్టమైందని, దీంతో  ఆయన స్థాపించబోయే ఆయన పార్టీకి సంబంధించి విధి విధానాలు, సిద్ధాంతాలు, పొత్తులు.. ఇలా పలు అంశాలు ప్రస్తుంతం ప్రాధాన్యం సంపాదించుకున్నాయని అన్నారు.

ఇదిలా ఉంటే రజినీ ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో పార్టీని స్థాపించడం, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుండడం తమిళనాడులో తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రజనీ రాజకీయ పొత్తులపై భిన్న వాదలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. బీజేపీతో కలిసి ముందుకెళతారని కొన్ని వర్గాలు చెబుతుంటూ, మరికొంతమంది మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: