చండీఘర్: కరోనా వ్యాక్సిన్ తయారై మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ, అమెరికాకు చెందిన పీఫైజర్, మొడెర్నా, యూకేలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ ప్రస్తుతం ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్ కూడా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. అందులో భారతీ బయోటెక్‌కు చెందిన కొవాక్సిన్ ఫైనల్ ట్రయల్స్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది.        

కొద్ది వారాల క్రితం హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కూడా ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారట. అయితే వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల తరువాత ఆయనకు కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘ఇటీవల నేను కొవ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్నాను. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కొద్ది వారాలకు కరోనా టెస్ట్ చేయించుకుంటే అందులో పాజిటివ్ వచ్చింది’ అని అనిల్ విజ్ తెలిపారు. ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని, హోం క్వారంటైన్ కావాలని ఆయన అభ్యర్థించారు.      

ఇదిలా ఉంటే హర్యానాలో కొవ్యాక్సిన్ ట్రయల్స్‌ను అనిల్ విజ్‌ స్వయంగా ప్రారంభించారు. ఆయనే తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయనే కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో దీనికి కారణాలు ఏమై ఉంటాయని తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే కరోనా బారిన పడ్డారా..? లేక వేరే ఏదైనా కారణమా..? అనే దిశలో ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇక దీనిపై కొవ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: