న్యూఢిల్లీ: రైతుల నిరవధిక ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. స్వయంగా మోదీనే దీనిపై సమీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారట. రైతు ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోయినప్పటకీ వాటిని సవరించాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారట. పంటల మద్దతు ధరకు హామీ, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో పాటు కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి సమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించే అవకాశాలపై కేంద్రం దిగొచ్చే అవకాశం ఉందంటూ ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై న్యాయ శాఖతో కూడా వ్యవసాయ శాఖ చర్చలు జరిపిందట. 5వ దఫా చర్చలు శనివారం మొదలవుతాయి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులు షా, రాజ్‌నాథ్, తోమర్, పీయూశ్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే కేంద్ర వ్యవసాయ చట్టాలను సవరించాలనే నిర్ణయంపైనే చర్చ జరిగిందని, అందులో సవరణకే అందరూ మొగ్గు చూపారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే  రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత 10 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. వారిని శాంతపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తూనే ఉంది. అంతేకాదు ఇంతకు ముందు కూడా వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ మేరకు రైతులకు కొన్ని ప్రతిపాదనలను కూడా పంపించింది. కానీ రైతులు వాటిని అంగీకరించలేదు. కేంద్రం చేసిన ప్రతిపాదన తమకు సంతృప్తికరంగా లేవని ప్రకటించాయి. పూర్తిగా చట్టాలను రద్దు చేస్తేనే వెనక్కి తగ్గుతామని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. అందులో భాగంగానే ఈ నెల 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

రైతుల ఆందోళనలకు వామ పక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. డిసెంబరు 8న జరగనున్న భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మిగతా లెఫ్ట్ పార్టీలు కూడా రైతులకు మద్దతుగా కలిసి రావాలని పిలుపునిచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయడానికే పూనుకోవడం చర్చనీయాంశమవుతోంది. మరి వీటికి రైతు సంఘాలు ఒప్పుకుంటాయో లేదో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: