విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు రథం సందర్శన, తీవ్ర వ్యాఖ్యలతో పలు నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యటం , ఆ తర్వాత జరుగుతున్న విచారణ తెలిసిందే.దీనిపై ఏపీలో పెద్ద రగడ కొనసాగింది. అంతకు ముందే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కావటం , ఆతర్వాత దుర్గ గుడిలో మూడు వెండి సింహాలు మాయం కావటంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీల నేతలు అమ్మవారి వెండి రథాన్ని పరిశీలించారు

.విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథంపై వెండి సింహాల ప్రతిమల మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు .దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహాల అదృశ్యాన్ని తేల్చేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది.పదుల సంఖ్యలో అనుమానితులను విచారించారు.గతేడాది సెప్టెంబర్ లో దుర్గమ్మ వెండిరథంపై సింహాల ప్రతిమలు మాయమైనట్లు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి.....మూడు సింహాల ప్రతిమల మాయం కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. విచారణలో భాగంగా ఆలయ సిబ్బంది, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలతోపాటు ఇలాంటి చోరీలకు పాల్పడే 40 మందిని విచారించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు.

ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు..దొంగతనాల కేసులో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా దుర్గమ్మ వెండి సింహాల ప్రతిమల విషయం వెలుగు చూసింది. వాటిని తానే అపహరించినట్టు బాలకృష్ణ అంగీకరించాడు. దొంగిలించిన ప్రతిమలను అతడు తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి విక్రయించాడు. దీంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి దగ్గర నుంచి ప్రతిమలను తీసుకున్న వ్యాపారి వెంటనే వాటిని కరిగించాడని, వాటి బరువు దాదాపు 16 కిలోలు ఉందని చెబుతున్నారు.  అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: