దేశమంతటా కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది.  మహమ్మారి రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. దీంతో ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తి కట్టడికై పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించడం వంటి చర్యలు చేపడతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
 గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 62,097 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 519 మంది కరోనాతో మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముంబైకి చెందిన డాక్టర్‌ తృప్తి గిలాడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో నెటిజన్ల మనసును ద్రవింపజేస్తోంది. ఆమె మాట్లాడుతూ.. "దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందెన్నడూ చూడలేదు. రోజురోజుకీ ఆశ చచ్చిపోతోంది. నాలాగే చాలా మంది డాక్టర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నా గుండె పగిలిపోతోంది. నన్ను బాధిస్తున్న విషయాల గురించి మీతో పంచుకుంటే నాకు కాస్త మనశ్శాంతి లభిస్తుందని భావిస్తున్నా. నగరాలు, పట్టణాలు, పల్లెలను కరోనా చట్టేసింది. ముఖ్యంగా ముంబయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. రోగులకు పడకలు లభించడంలేదు.  మేము నిస్సహాయులుగా మారుతున్నాం. ఇలాంటి పరిస్థితులను నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కచ్చితమైన జాగ్రత్తలు వహించండి. ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే" అని ఆ డాక్టర్ కంటతడి పెట్టారు. అందరూ జాగ్రత్తలు పాటిస్తే కరోనాను ఎదుర్కోగలమని, మూడో దశ రాకుండా నివారించగలమని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: