కృష్ణాజిల్లా : "మాయ‌మైపోతున్న‌డ‌మ్మా మ‌నిష‌న్న‌వాడు...మ‌చ్చుకైనా చూడు లేడు మాన‌వ‌త్వం ఉన్న‌వాడు"  అన్న అందె శ్రీ పాట‌కు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అద్దంప‌డుతున్నాయి.క‌రోనా పుణ్య‌మా అని సాటి మ‌నిషికి సాయం చేయ‌లేని దీన ప‌రిస్థితుల్లో ప్ర‌ప‌చం కొట్టుమిట్టాడుతుంది.క‌రోనా వైర‌స్ ఎవ‌రికైనా సోకింద‌ని తెలియ‌గానే స‌మాజం వారిని వెలివేస్తుంది.కన్న‌వారు,ఆప్తులు,బంధువులు సైతం అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి కూడా ముందుకు రాకుండా అనాథ శవాలుగా వ‌దిలిపెడుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది.

న‌డిరోడ్డుపై క‌రోనా మృత‌దేహాన్ని వ‌దిలివెళ్లిన అంబులెన్స్ సిబ్బంది

కృష్ణాజిల్లా తిరువూరు మండ‌లం మునుకుళ్ల గ్రామంలో మాన‌వ‌త్వం మంట‌క‌లిసిన సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది.గ్రామానికి చెందిన షేక్ సుభాని(35) క‌రోనా బారిన పడ్డాడు.అయితే చికిత్స కోసం 108 అంబులెన్స్ కి కుటుంబ స‌భ్యులు స‌మాచారం ఇచ్చారు. సుభానిని త‌న ఇంటి ద‌గ్గ‌ర అంబులెన్స్ లో ఎక్కించుకున్న సిబ్బంది కొంత‌దూరం వెళ్లాక మ‌ర‌ణించాడ‌ని మాన‌వ‌త్యం మ‌ర‌చిన ఆ అంబులెన్స్ సిబ్బంది అత‌ని మృత‌దేహాన్ని రోడ్డుపైనే వ‌దిలి వెళ్లిపోయారు.రెండు గంట‌లుగా సుభాని మృత‌దేహం రోడ్డుపైనే ఉంది.మృత‌దేహం వ‌ద్ద ఆయ‌న కుటుంబ స‌భ్యులు రోదించారు.రహదారిపై ప్రయాణించే వారు సైతం స్పందించలేదు. వెంటనే ఈ సమాచారాన్ని తెలుసుకున్న తిరువూరు పట్టణ సీఐ శేఖర్ బాబు, తిరువూరు పోలీసు సిబ్బందిని వెంటపెట్టుకుని ఆ ప్రాంతంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సురేష్, ఆదినారాయణ, వాలంటీర్ల‌తో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.పోలీస్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు PPE కిట్లు ధరించి, గ్లౌజులు, మాస్కులు ఉపయోగించి ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేయించారు.
బాధ్య‌త‌యుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అంబులెన్స్ సిబ్బంది ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై మృతుడి బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.క‌రోనాతో చ‌నిపోయిన వారిని కోవిడ్ ప్రోటోకాల్ ప్ర‌కారం మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు జ‌ర‌పాల్సి ఉంటుంది.కొన్ని సంద‌ర్భాల్లో ఆయా మున్సిప‌ల్ సిబ్బంది, వైద్య సిబ్బంది ఆ మృత‌దేహాల‌ను స్మ‌శాన‌వాటిక‌కు త‌ర‌లించి అక్క‌డ అంత్య‌క్రియ‌లు చేస్తున్నారు. కానీ ఇక్క‌డ మాన‌వ‌త్వం మ‌ర‌చి ఇలా న‌డిరోడ్డుపై మృతదేహాన్ని వ‌ద‌లివేయ‌డం  అంద‌ర్ని క‌లిచివేస్తుంది.అక్కడి స్థానికులతో సీఐ మాట్లాడుతూ మానవత్వాన్ని మరిచి కరోనా మహమ్మారి ముందు తల వంచడం చాలా  దారుణ‌మ‌ని, క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారి ప‌ట్ల వివక్ష చూపవద్దు అని తెలిపారు.అయితే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన అంబులెన్స్ డ్రైవ‌ర్‌ని,సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితులు డిమాండ్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: