కరోనా నుంచి కోలుకున్నా ఇళ్లకు వెళ్లకుండా కరోనా బాధితులు ఆస్పత్రుల్లోనే ఉంటున్న  విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ద‌వాఖాన‌ల్లో అన‌వ‌స‌రంగా ఎక్కువ రోజులు గ‌డిపే కొవిడ్-19 రోగులు స‌త్వ‌ర‌మే డిశ్చార్జి అవ‌డం ద్వారా ఇన్ఫెక్ష‌న్ తీవ్రంగా ఉన్న వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని క‌ర్నాట‌క సీఎం బీఎస్ య‌డియూర‌ప్ప పేర్కొన్నారు. సుమారు 503 మంది 20 రోజులు ఆస్పత్రుల్లో ఉండి కోలుకున్నారు. అయితే వారంతా డిశ్చార్జ్‌ అయ్యే ఆలోచనలో లేనట్లు తెలుస్తోందన్నారు. బెడ్ల కొరత ఉండడంతో కోలుకున్న వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని ఈ సంద్భంగా ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. ఇంటి నుంచే చికిత్స పొందే వీలున్న రోగులు సైతం కొవిడ్ కేర్ సెంటర్ల‌లో తిష్ట వేసి ద‌వాఖాన‌లో చికిత్స అవ‌స‌ర‌మైన రోగుల‌కు బెడ్లు ఖాళీ లేని ప‌రిస్థితి తీసుకువ‌చ్చార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొవిడ్ వార్ రూమ్ తో ద‌వాఖాన‌ల్లో బెడ్ల వివ‌రాలు, ఆక్సిజ‌న్ అందుబాటు, మందుల ల‌భ్య‌త వంటి స‌మ‌స్త స‌మాచారం ల‌భ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు. టీకాలు వచ్చిన తక్షణమే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఆద‌ర్శంగా కొవిడ్ వార్ రూంను క‌ర్నాట‌క ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంద‌ని అన్నారు. వార్‌ రూంల సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: