న్యూఢిల్లీ  : పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా మూడోరోజు అమాంతం పెరిగాయి.ఈ నెల 4వ తేదీ నుంచి ఈ రోజు వ‌ర‌కు ఏడుసార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి.ఈ నెల 8,9 తేదీల్లో మాత్రమే ధ‌ర‌లు పెర‌గ‌కుండా నిల‌క‌డ‌గా ఉన్నాయి.అయితే  సోమవారం నుంచి మళ్లీ ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటూ వచ్చింది. తాజాగా పెంచిన ధ‌ర‌ల ప్రభావంతో అనేక పట్టణాల్లో పెట్రోల్ వంద రూపాయల మార్క్‌ను దాటింది.డీజిల్ 90 రూపాయలను క్రాస్ చేసింది.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం పెట్రోల్ లీటర్‌కి 22 నుంచి 25 పైసలు, డీజిల్ లీటర్‌కి 24 నుంచి 27 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.91.05, డీజిల్ 82.61 పైసలుగా  ఉంది. ముంబైలో పెట్రోల్ రేటు 98.36 రూపాయలు, డీజిల్‌ ధర 89.75 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 93.84, డీజిల్‌ ధర రూ. 87.49, కోల్‌కతలో పెట్రోల్ రూ.92.16 పైసలు, డీజిల్‌ ధర రూ.85.45 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్-95.11, డీజిల్-87.57, హైదరాబాద్‌లో పెట్రోల్-95.67, డీజిల్ 90.06, భోపాల్‌లో లీటర్ పెట్రోల్-100.08, డీజిల్-90.95, పాట్నాలో పెట్రోల్-94.28, డీజిల్ 87.84, లక్నోలో పెట్రోల్-89.96, డీజిల్-82.99, గురుగ్రామ్‌లో పెట్రోల్-89.96, డీజిల్-83.19గా నమోదైంది.

అయితే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 18 రోజుల పాటు ఆయిల్‌ కంపెనీలు ధరలు పెంచలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రం ధ‌ర‌లను ఒక్క‌సారిగా చ‌మురు కంపెనీలు పెంచాయి. వ‌రుస‌గా ఏడు రోజుల నుంచి ప్ర‌తిరోజు పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంపై వాహ‌నదారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఒక ప‌క్క క‌రోనా క‌ల్లోలంతో ఇబ్బందులు ప‌డుతుంటే సామాన్యుడి న‌డ్డివిరిచేలా ధ‌ర‌లు పెరుగుతున్నాయి.వీటితో పాటు నిత్వ‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: