కరోనా బారిన కోలుకున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. తెలంగాణలో మ్యుకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)తో ఒక వ్యక్తి మృతిచెందారు.  నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్న నిర్మల్‌ జిల్లా బైంసా డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులపై తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయని తెలిపారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదని ఆయన వివరించారు. హైడోస్ స్టెరాయిడ్స్ వాడే కొందరిలో మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో అనవసరంగా భయాందోళనలకు గురికావొద్దని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: