నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై దాడిని టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రఘురామకృష్ణరాజును గాయపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. అక్రమ కేసులో అరెస్ట్ చేయడమేగాక గాయాలయ్యేలా కొడతారా అంటూ ప్రశ్నించారు. రఘురామ నేరస్తుడు కాదని, సీఐడీ పెట్టిన అక్రమ కేసులో నిందితుడు మాత్రమేనని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రవర్తించడం దారుణమని..కస్టడీలో ఉండేవారిని కొట్టే హక్కు పోలీసులకు లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఇలాంటి చర్యలు ఫ్యాక్షన్‌ను తలపిస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకమే ప్రమాదంలో పడిందని, అయితే రాజ్యాంగం, న్యాయవ్యవస్థలు ఈ నమ్మకాన్ని తిరిగి నిలబెడతాయని తాను భావిస్తున్నానన్నారు. ఎంపీ పట్ల ఇంతటి జులుం ప్రదర్శిస్తే ఇక సామాన్యుల గతేంటని చంద్రబాబు ప్రశ్నించారు. నడవలేని స్థితిలో ఎంపీ ఉన్నారంటే ఎంతగా హింసించారో తెలుస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: