వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డంలేద‌నే త‌న‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలుగుదేశం పార్టీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఆరోపించారు. ఎక్క‌డో ఉన్న భూములు చూపించి అవి త‌న‌వేనంటూ అధికార పార్టీ ప్ర‌చారం చేస్తే తాను కూడా చేయ‌గ‌లిగిందేమీ లేద‌ని వ్యాఖ్యానించారు. గాజువాక మండ‌లంలోని ప‌లు భూముల్లో అక్ర‌మ క‌ట్ట‌డాలంటూ గ్రేట‌ర్ విశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆదివారం వాటిని కూల్చేశారు. అవి ప‌ల్లా భూముల‌ని, ప‌ల్లా అక్ర‌మ క‌ట్ట‌డాలంటూ అధికార పార్టీ నేత‌ల ఆరోప‌ణ‌ల‌పై ప‌ల్లా స్పందించారు. విశాఖ‌ప‌ట్నంలో సోమ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌న‌కు ఎక్క‌డెక్క‌డ భూములున్నాయ‌నే విష‌యాన్ని పొందుప‌రిచాన‌ని, వైసీపీ నేత‌లు కావాలంటే అవి ప‌రిశీలించుకోవ‌చ్చ‌న్నారు. విశాఖ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కూడా ప‌ల్లా బ‌రిలో నిలిచిన‌ప్ప‌టికీ మెజారిటీ వార్డుల‌ను వైసీపీ కైవ‌సం చేసుకోవ‌డంతో ఆయ‌న ప్ర‌తిప‌క్ష పాత్ర‌కు ప‌రిమిత‌మ‌య్యారు. కొద్దిరోజులుగా శ్రీ‌నివాస‌రావును వైసీపీ చేర‌మ‌ని ఒత్తిడి చేస్తున్నార‌ని, ఆయ‌న నిరాస‌క్త‌త చూపించ‌డంతోనే అక్ర‌మ భూములు, అక్ర‌మ క‌ట్ట‌డాలంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు కూడా వైసీపీపై విమ‌ర్శ‌ల‌కు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: