తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జన‌తాపార్టీ నుంచి త‌న‌ను ఆహ్వానించార‌ని, ఫ‌లానా ప‌ద‌విస్తామ‌ని వారు త‌న‌కు ఎలాంటి ప్ర‌తిపాద‌న చేయ‌లేద‌ని, తాను కూడా వారికి ఏమీ చెప్ప‌లేద‌ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ అన్నారు. సోమ‌వారం ఆయ‌న జ‌గిత్యాల‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ప‌ద‌వుల కోసం తాను ఏనాడూ ప్ర‌తిపాద‌న‌లు చేసే వ్య‌క్తిని కాన‌ని, ప‌నిచేసుకుంటూ వెళ్లే క్ర‌మంలో ప‌ద‌వులే వ‌రించాయ‌న్నారు. ప్ర‌జా జీవితంలో ఉన్నాం కాబ‌ట్టి ఏం చేస్తే మ‌రింత ముందుకు వెళ్ల‌వ‌చ్చు అనే నిర్ణ‌యంతో రావాల‌ని ప‌లువురు కోరుతున్నార‌ని, రెండు పార్టీల ఆహ్వానంపై పార్టీ నేత‌లు, అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్లు ర‌మ‌ణ వెల్ల‌డించారు. తొలినుంచి బ‌ల‌హీన‌వ‌ర్గాలకు చెందిన వ్య‌క్తిగా తెలుగుదేశం పార్టీ కోసం కృషిచేశాన‌ని, దివంగ‌త ఎన్టీఆర్‌, చంద్ర‌బాబునాయుడు త‌న‌ను ఎంతో ప్రోత్స‌హించార‌ని, మంత్రిగా, ఎంపీగా అవ‌కాశం ఇచ్చార‌ని, ఇప్పుడు రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్నాన‌ని ర‌మ‌ణ గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీప‌ట్ల ప్ర‌జ‌ల్లో మ‌రింత గౌర‌వం పెరిగేలా సిద్ధాంతాల‌ను పాటిస్తున్న‌ట్లు ర‌మ‌ణ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: