తెలంగాణ రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాలు రానున్న రోజుల్లో మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌తాయ‌ని ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్యానించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అనేక అంశాలు చ‌ర్చ‌కు రానున్నాయ‌ని, ఎన్ని ప‌రిణామాలు జ‌రిగినా అవ‌న్నీ తెలంగాణ రాష్ట్ర స‌మితి మంచికేన‌ని, అంత‌కుమించి తానేమీ మాట్లాడ‌న‌ని క‌విత అన్నారు. మంగ‌ళ‌వారం జ‌గిత్యాల‌లో మీడియాతో మాట్లాడిన క‌విత ఈ వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేంద‌ర్‌తోపాటు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఐకాస నేత‌లు ప‌లువురు భార‌తీయ జ‌న‌తాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి త్వ‌ర‌లో త‌న కొత్త అధ్య‌క్షుడిని ప్ర‌క‌టించ‌బోతోంది. కేసీఆర్‌పై, టీఆర్ ఎస్‌పై నిప్పులుచెరిగే రేవంత్‌రెడ్డికే అవ‌కాశాలు ఎక్కువ‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న ఎల్‌.ర‌మ‌ణ కూడా పార్టీమారే అవ‌కాశాలున్నాయ‌ని తేలుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ర‌మ‌ణ ఏమీ చెప్ప‌క‌పోయినా మ‌రో వారంరోజుల్లో ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని వెలువ‌రించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఈ ప‌రిణామాల‌న్నింటినీ దృష్టిలో ఉంచుకొని క‌విత మాట్లాడిన‌ట్లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: