యాదాద్రి జిల్లా అడ్డగూడుర్ లాకప్‌ డెత్‌ కేసులో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. లాకప్‌డెత్‌కు కారణమైన ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై ప్రభుత్వం వేటు వేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన దళిత మహిళ మరియమ్మ... అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో లాకప్‌ డెత్‌కు గురయ్యారు. ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, జానయ్యను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ఈ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం... పూర్తిస్థాయి విచారణ అనంతరం విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరియమ్మ లాకప్‌డెత్‌పై ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ప్రత్యేకంగా విచారణ కమిటీని కూడా అపాయింట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311(2)(B), 25(2)  ప్రకారం విధుల నుంచి తొలిగిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: