భార‌త వాతావ‌ర‌ణ శాఖ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈ రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ప‌డుతున్నాయి. రాయలసీమలో రెండురోజుల‌పాటు ఒక మోస్త‌రు నుంచి భారీవర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండు అక్కడక్కడ భారీ వర్షాలు ప‌డ‌తాయ‌ని, మిగిలిన ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలియ‌జేసింది. అలాగే తీరం వెంబ‌డి గంటకు 50 నుంచి 60 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని, సముద్రం అలజడిగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు శుక్ర‌వారం, శనివారం సముద్రంలోకి వేటకు వెళ్లరాద‌ని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని రాష్ట్ర విప‌త్తుల‌శాఖ క‌మిష‌న‌ర్  కన్నబాబు కోరారు. ఇప్ప‌టికే కురుస్తున్న వ‌ర్షాల‌తో రైతాంగం ఆందోళ‌న‌కు గుర‌వుతోంది. పంట త‌డిచిపోవ‌డంతో ఆరుగాలం శ్ర‌మించిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం రాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. మ‌రో రెండురోజులు గ‌డిస్తేకానీ వాతావ‌ర‌ణ మార్పుల‌పై పూర్తిస్థాయి స‌మాచారం రాద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag