ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరోసారి ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. నియంత పాలన కొనసాగుతోందని....  రాష్ట్రాన్ని ఓ హిట్లర్ పరిపాలిస్తున్నాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాధమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. నాయుడు అనే ఉపాథ్యాయుడ్ని అకారణంగా సస్పెండ్ చేయడాన్ని లోకేష్ తప్పుబట్టారు. సోషల్ మీడియాలో ఎవరో పంపిన మెసేజ్ ను ఫార్వర్డ్ చేసినందుకే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. అలా అయితే విద్యాబుద్దులు నేర్పే గురువులకు చీప్ లిక్కర్ అమ్మే దుకాణాల ముందు డ్యూటీ వేసిన సీఎం వైఎస్ జగన్ ను ఏం చేయాలని ప్రశ్నించారు. నడిరోడ్డు మీద ఉరితీయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛని వైసీపీ సర్కార్ హరిస్తోందన్నారు. ఎస్.నాయుడుపై తక్షణమే సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే టీచర్లను వేధించడం ఏ మాత్రం సరికాదన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు నారా లోకేష్.


మరింత సమాచారం తెలుసుకోండి: