తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల నాయకత్వంలోనే దేవినేనిపై దాడి జరిగిందన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. కొండపల్లి ఫారెస్టులో అక్రమ మైనింగ్ తో వేలకోట్లు కొల్లగొట్టిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బండారాన్ని బయటపెట్టారనే కోపంతోనే ఉమాను హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించారు. మాజీ మంత్రిపైనే దాడి జరిగిందంటే.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారనే ఉమాపై కక్ష కట్టి మరీ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు నారా లోకేష్. మాజీ మంత్రిపై దాడికి డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. గుండాయిజం ఎల్లవేళలా సాగదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్న పయ్యావుల... రాష్ట్రంలో శాంతిభద్రతలు ఐసీయూలో ఉన్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: