అంతా అనుకున్నంత‌గా జ‌రిగింది.. అంతా అనుకోని విధంగా జరిగింది. మొద‌టిది యెడ్డీకి రెండ‌వ‌ది బొమ్మైకి చెందింది. సుదీర్ఘ కాలం న‌డిచిన నాట‌కం ఇలా ముగియ‌డం ఓ విధంగా ఆనంద‌దాయ‌కం..ఆయ‌న‌తో పాటు ముగ్గురు డిప్యూటీ సీఎంలకూ అవ‌కాశం వ‌రించింది. ఆర్.అశోక్‌, ఆర్‌.శ్రీ‌రాములు, గోవింద కార‌జోళ అనే ముగ్గురికి ప‌ద‌వులు ఇచ్చి సంతృప్తిప‌రిచింది.

బ‌స‌వ‌రాజు బొమ్మై అను నేను అంటూ ఇవాళ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆయ‌న రేప‌టి వేళ ఎన్ని సంచ‌ల నాల‌కు కార‌ణం అవుతారో అన్న‌ది ఊహ‌కు అంద‌నిది. య‌డ్యూర‌ప్ప సామాజిక‌వ‌ర్గం కు చెందిన వ్య‌క్తినే నియ‌మించి రాష్ట్రంలో ఆ వ‌ర్గం పై ప‌ట్టు త‌మ నుంచి చేజారి పోకుండా జాగ్ర‌త్త ప‌డిన బీజేపీ కి ఇక‌పై మ‌రిన్ని స‌వాళ్లు త‌ప్ప‌వు. క‌ర్ణాట‌క‌లో పార్టీ నిల‌దొక్కుకు నేందుకు య‌డ్యూర‌ప్ప చాలా కృషి చేసిన మాట వాస్త‌వ‌మే! కానీ ఆయ‌న పంథాలో ఏమ‌యినా మార్పు ఉంటుందా లేదా ఈయ‌న‌కు స‌హ‌క‌రిస్తారా అన్న‌ది కీలకం. అల‌వాటు మాదిరిగా ఆయ‌న‌కో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇచ్చి బీజేపీ బాస్ గ‌మ్మునుండ‌వో అని అంటారా? ఏమో ఏద‌యినా జ‌ర‌గ‌వచ్చు. క‌ర్ణాట‌క‌లో అధికార దాహం తీర‌నిది .. అని చెప్ప‌లేం కానీ తీరేలా చేయాల్సిన బాధ్య‌త బీజేపీదే! రాష్ట్రంలో అవినీతి,అక్ర‌మాల‌పై బీజేపీ కాస్త సీరియ‌స్ గా దృష్టి పెట్టి వాటి నియంత్ర‌ణ‌కు కృషి చేయాలి. అలానే మిగిలిన సీనియ‌ర్ నాయ‌కుల సాయంతో పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి.. సెక‌నుకోమారు ప‌రిణామాలు మారేలా రాజ‌కీయం ఉంటే ప్ర‌జ‌ల‌కు విసుగు త‌ప్ప‌దు. ఇక‌నైనా అసంతృప్తులను  నిలువ‌రించి సాఫీగా ప్ర‌యాణం సాగేందుకు బీజేపీ అధిష్టానం సంబంధిత చ‌ర్య‌లు ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకుని బొమ్మైకు స‌హ‌క‌రించాల్సిన బాధ్య‌త ఉంది. సంక్షోభ కాలాల నివార‌ణ ఇప్ప‌టి రాజ‌కీయాల్లో
ఎంత క‌ష్ట‌మో ఈ సీన్ నిరూపించింది క‌నుక ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.



మరింత సమాచారం తెలుసుకోండి: