విశాఖ స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం ప్రకటించిన వెంటనే... కార్మిక లోకం అగ్గిమీద గుగ్గిలంలా మారింది. పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదే స్ఫూర్తితో ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి తీరుతామని..  ఈ విషయంలో కోర్టుల జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కేంద్రం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే టెక్నికల్ బిడ్లను కూడా ఈ రోజు తెరుస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపినప్పటికీ... కేంద్రం మొండిగా ముందుకు పోతోందని వైసీపీ ఎంపీలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన భారీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆగస్టు 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ నర్సింగరావు పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: