కేంద్రంలో న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తోన్న విధానాల‌కు వ్య‌తిరేకంగా ఈనెల 27న దేశ‌వ్యాప్త స‌మ్మె నిర్వ‌హిస్తున్న‌ట్లు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ తెలిపారు. నెల్లూరులో పాద‌యాత్ర చేస్తోన్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ను ప్ర‌యివేటు ప‌రం చేయ‌డంతోపాటు అభివృద్ధికి పెట్టుబ‌డి పెట్టిన సంస్థ‌ల‌ను కూడా ధారాద‌త్తం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. దేశంలోని సంప‌ద కేవ‌లం ఐదారుగురు వ్య‌క్తుల మ‌ధ్యే ఉంద‌ని, వీరికి కేంద్రం మ‌రింత స‌హ‌కారం అందిస్తుండ‌టం విచార‌క‌ర‌మ‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. వైసీపీ నేత‌లు ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టంద్వారా ప్ర‌జ‌ల‌కు ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. తాను పాద‌యాత్ర చేస్తుంటే ఇంత‌మంది పోలీసులున్నార‌ని, అటువంటిది చంద్ర‌బాబు ఇంటిద‌గ్గ‌ర ఉన్న పోలీసులు దాడిచేస్తున్న‌వారిని ఎందుకు అడ్డుకోలేద‌ని ప్ర‌శ్నించారు. హోంమంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని రామ‌కృష్ణ డిమాండ్ చేశారు. అనేక ప్రాణ‌త్యాగాల‌తో సాధించుకున్న విశాఖ ఉక్కు క‌ర్మాగారం ఆంధ్రుల మ‌నోభావాల‌తో ముడిప‌డివుంద‌ని, దాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోను ప్ర‌యివేటు ప‌రం కానివ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: