ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీకి భారీ షాక్ త‌గిలింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత‌, సిట్టింగ్ ఎంపీ అయిన బాబూల్ సుప్రియో తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అభిషేక్ బెన‌ర్జీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు డెరిక్ ఒబ్రెయిన్ స‌మ‌క్షంలో ఆయ‌న తృణ‌మూల్ కండువా క‌ప్పుకున్నారు. స్థానికంగా ఉన్న బీజేపీ నేత‌ల‌తో ఉండే విభేదాల‌వ‌ల్లే పార్టీ మారిన‌ట్లు తెలుస్తోంది. కేంద్రంలో మంత్ర ప‌ద‌వి నుంచి తొల‌గించిన త‌ర్వాత స్త‌బ్దుగా ఉన్న బాబూల్ తృణ‌మూల్‌లో చేర‌తారంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న వాటిని ఖండించారు. రాజ‌కీయాల నుంచి క్రియాశీల‌కంగా వైదొలుగుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. బెంగాల్‌లో జ‌ర‌గ‌నున్న మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి రూపొందించిన స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో సుప్రియో పేరు కూడా ఉంది. అస‌న్‌సోల్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బాబూల్ సుప్రియో బీజేపీని వీడ‌టం ఆ పార్టీకి పెద్ద దెబ్బేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇంత‌కు ముందు ముకుల్‌రాయ్ కూడా తిరిగి తృణ‌మూల్ గూటికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp