గ్రీన్‌ఛాలెంజ్‌కు స‌మాంత‌రంగా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి వైట్‌ఛాలెంజ్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయ‌న మంత్రి కేటీఆర్‌కు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డికి ఈ స‌వాల్ విసిరారు. దీనిపై కొండా స్పందించారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు గ‌న్‌పార్క్ వ‌ద్ద‌కు వ‌స్తాన‌న్నారు. అక్క‌డి నుంచి ఉస్మానియా ఆసుప‌త్రికి వెళ్లి ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుందామ‌న్నారు. డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల కోసం ర‌క్త‌న‌మూనాలిద్దామ‌న్న రేవంత్ ఛాలెంజ్‌కు కొండా ఇలా స్పందించారు. గ‌న్‌పార్క్ వ‌ద్ద‌కు కొండాతోపాటు ఆయ‌న అభిమానులు కూడా భారీగా చేరుకునే అవ‌కాశం ఉండ‌టంతో ప‌రిస్థితి చేయిదాట‌కుండా ఉండేందుకు పోలీసులు భారీభ‌ద్ర‌త ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా చూస్తున్నారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టులు, ద‌ర్శ‌కుల‌ను కొద్దిరోజులుగా ఈడీ అధికారులు మ‌ద‌క‌ద్ర‌వ్యాల వినియోగం, మ‌నీ లాండ‌రింగ్ కేసుల కింద విచార‌ణ జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. పూరీజ‌గ‌న్నాత్‌, ఛార్మి, ద‌గ్గుబాటి రానా, న‌వ‌దీప్‌, త‌రుణ్‌, నందు, ముమైత్‌ఖాన్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ త‌దిత‌రుల‌ను విచారించారు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం ఏమీ మాట్లాడ‌టంలేదంటూ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌తోపాటు కొండాకు వైట్‌ఛాలెంజ్ విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: