రచయిత జావేద్ అఖ్తర్‌ వేసిన పరువునష్టం కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోమవారం అంథేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజ‌ర‌య్యారు. ఈసారి గైర్హాజరైతే అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ కోర్టు హెచ్చరించ‌డంతో ఆమె విచారణకు హాజ‌ర‌య్యారు. ఈ కేసును వేరే కోర్టుకు బదలీ చేయాల్సిందిగా కోరుతూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ దాఖలు చేసినట్టు కంగనా న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి తెలిపారు. అఖ్త‌ర్‌కు వ్యతిరేకంగా కౌంటర్ కంప్లయింట్ ఫైల్ చేశామ‌న్నారు. అఖ్తర్ చేసిన ఒరిజనల్ ఫిర్యాదు, తన క్లయింట్ దాఖలు చేసిన కౌంటర్ కంప్లయింట్ రెండింటినీ బదిలీ చేయాలని రిజ్వాన్ కోర్టుకు విన్న‌వించారు. తన క్లయింట్‌పై చేసిన ఆరోపణలు విచారణార్హం కావ‌ని, రాజీకి, బెయిలుకు అవకాశం ఉందన్నారు. కోర్టుకు హాజరుకాక‌పోతే అరెస్టు వారెంటు జారీ చేస్తామని తెల‌ప‌డంద్వారా కోర్టు పరోక్షంగా హెచ్చరికలు చేసిందని, ఇలాంటి నేరాల విషయంలో ప్రతిసారి కోర్టు ముందు కంగనార‌నౌత్‌ హాజరుకావాల్సిన అవసరం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. విచారణను నవంబర్ 15కు కోర్టు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: