స్వ‌ర నీరాజ‌నం పేరిట గాన గంధ‌ర్వుడు బాలు ప్రథ‌మ వ‌ర్థంతిని నిర్వ‌హిస్తున్నారు శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మిత్రా ఫౌండేష‌న్. వీరితో పాటు సిక్కోలు ఫ్యూచ‌ర్ సింగ‌ర్స్ కూడా ఆ మ‌హ‌నీయునికి నివాళి అర్పిస్తూ, త‌మకు తోచిన రీతిలో ఆ గాన గంధర్వుడ్ని స్మ‌రిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మున్సిప‌ల్ క‌మిష‌నర్ ఓబులేశు విచ్చేశారు. స్థానిక బాపూజీ క‌ళామందిరంలో ఈ కార్య‌క్ర‌మాన్ని జ్యోతి ప్ర‌జ్వ‌లన చేసి ప్రారంభించారు మిత్రా ఫౌండేష‌న్ నిర్వాహ‌కులు. ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కులు మాట్లాడుతూ.. సినీ సంగీత స్వ‌ర ప్ర‌పంచాన్ని త‌న‌దైన గాన ల‌హ‌రిలో ఊగించిన గొప్ప గాయ‌కులు, విన‌య సంప‌న్నులు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అని అన్నారు. ఆయ‌న స్ఫూర్తితో వ‌చ్చిన ఎంద‌రో వ‌ర్థ‌మాన గాయ‌కులు ఎన్నో ఉన్న‌త శిఖ‌రాలు అందుకున్నార‌ని చెప్పారు. ఆయ‌న స్మ‌ర‌ణ‌ను బాధ్య‌త‌గా భావిస్తూ, కోవిడ్ నియ‌మావ‌ళిని పాటిస్తూ ఈ రోజు స్వ‌ర నీరాజ‌నం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఉద యం తొమ్మిది గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, తిరిగి సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన గాయ‌నీ గాయ‌కులు ప‌లు సినీ గీతాలు ఆల‌పించి, బాలూ సంస్మ‌ర‌ణ‌ను చేయనున్నార‌ని వెల్ల‌డించారు. తొలుత ఇటీవ‌ల మ‌ర‌ణించిన  శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప్ర‌ముఖ సినీ గాయ‌కులు గేదెల ఆనంద్ కు, నృత్యద‌ర్శ‌కులు శివ‌కు నివాళులు అర్పించారు. గాన, నృత్య క‌ళ‌ల్లో వారు రాణించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. కార్య‌క్ర‌మంలో మిత్రా ఫౌండేష‌న్ స‌భ్యులు గీతా శ్రీ‌కాంత్, దుప్ప‌ల వెంక‌ట‌రావు, పొన్నాన జ‌య‌రాం, గాయ‌కులు భార‌తీ ర‌మేశ్, నృత్య ద‌ర్శ‌కురాలు తిమ్మ‌రాజు నీర‌జ‌, ఇంకా సిక్కోలు ఫ్యూచ‌ర్ సింగ‌ర్స్ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap