బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీగా మారిందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతోంద‌ని, అయినా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మేధావిలా ఫీలవుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆదివారం జీవ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా బిలియన్‌ మార్చ్‌ చేయాలని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ మాట తప్పారంటూ మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియంలు నిర్మిస్తున్నారని, విద్యా ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్లు క‌ల్పిస్తున్నార‌న్నారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని, తప్పుడు మాటలు చెప్పడం మానుకోవాలని హిత‌వు ప‌లికారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రూ.200 పింఛన్‌ ఇస్తే, తెలంగాణలో రూ.2 వేలు ఇస్తున్నామ‌ని, ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని బీజేపీని ఆయ‌న ప్ర‌శ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: