మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఆటోలో ప్ర‌యాణిస్తున్న‌ ఐదుగురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. నాసిక్ జిల్లా నిఫాద్ తాలూకాలోని లాస‌ల్‌గావ్‌-వించూర్ రోడ్డుపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఆటో లాస‌ల్‌గావ్ నుంచి వించూర్‌కు వెళ్తుండ‌గా వేగంగా వ‌చ్చిన లారీ అదుపుత‌ప్పి ఆటోను ఢీకొట్టి ఐదుగురి మృత్యువాత‌కు కార‌ణ‌మైంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లం నుంచి పారిపోయిన లారీ డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ఐదుగురిలో ముగ్గురు 60-65 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న వృద్ధులుకాగా, మ‌రో వ్య‌క్తి వ‌య‌సు 40 సంవ‌త్సరాలు. వీరితోపాటు ప్ర‌మాదంలో ఒక మ‌హిళ కూడా మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.లాస‌ల్‌గావ్-వించూర్ రోడ్డుపై త‌రుచుగా ప్ర‌మాదాలు సంభ‌విస్తున్న‌ప్ప‌టికీ ర‌హ‌దారులమంత్రిత్వ‌శాఖ ఎటువంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌భుత్వానికి విన్న‌వించిన‌ప్ప‌టికీ ఎటువంటి స్పంద‌న లేద‌ని ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: