ఆంధ్రాలో గులాబ్ తుఫాను ప్ర‌భావంతో శ‌ని వారం అర్ధ‌రాత్రి నుంచి వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. ఆదివారం ఉద‌యం చిరు జ‌ల్లులు మొదలుకుని రోజంతా వాన కురుస్తూనే ఉంది. తీర ప్రాంతాలు కూడా అప్ర‌మ‌త్తం అయ్యాయి. మ‌త్స్య‌కార కుటుంబాల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఉద‌యం నుంచి శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో కూడా ఎడ‌తెరిపి లేకుండా వాన‌లు ప‌డుతున్నాయి. కొన్ని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. అదేవిధంగా ఇత‌ర ప్రాంతాల‌లో కూడా మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తు న్నాయి. తీవ్ర తుఫాను కార‌ణంగా గాలుల వేగం పైనే ఆందోళ‌న నెల‌కొంది. తుఫాను శ్రీ‌కాకుళం జిల్లా, క‌ళింగ ప‌ట్నం కు, ఒడిశా, గోపాల‌పురానికి మ‌ధ్య తీరం దాట‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎగువ‌న భారీ వ‌ర్షాల‌కు కురిస్తే దిగువ ప్రాంతాలు మ‌రింత జ‌ల‌మ‌యం అయ్యే ప్ర‌మాదం ఉన్నందున ఒడిశా మొద‌లుకుని ఆంధ్రా వ‌ర‌కూ అధికారులు ఆందోళ‌న‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తీవ్ర తుఫాను కు సంబంధించి సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ  ఫోన్ చేశారు. తుఫాను ప‌రిస్థితి  ఏంట‌న్న‌ది అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రాంతాల‌లో సీఎం తీసుకున్న చ‌ర్య‌ల‌పై మాట్లాడారు. తుఫాన్ హెచ్చరికల నేపద్యంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రధానికి  సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎస్ డీఆర్ ఎఫ్ ద‌ళాల‌ను క్షేత్ర స్థాయిలో మోహ‌రించామ‌ని చెప్పారు. ప్రాణ‌, ఆస్తిన‌ష్టం నివార‌ణ‌కు కృషి చేస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి ముంద‌స్తు చ‌ర్య‌లు చేపట్టామ‌ని వివ‌రించారు జ‌గ‌న్. ఈ విప‌త్తు స‌మ‌యంలో ఆంధ్రాకు తాను అండ‌గా ఉంటానని పీఎం న‌రేంద్ర మోడీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap