మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా) అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ‌బోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న హైద్రాబాద్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. ఫ‌లితాలు కూడా అదేరోజు వెల్ల‌డి కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్‌ రాజ్ వ‌ర్సెస్ మంచువిష్ణు పోరు ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి నెల‌కొంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న వీరిద్ద‌రూ ఇప్పటికే తమ తమ ఎజెండా, ప్యానల్ సభ్యుల లిస్ట్ ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఈరోజు ఉద‌యం ప్రకాష్‌ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఫిల్మ్ ఛాంబ‌ర్ లో నామినేషన్ దాఖ‌లు చేశారు.  ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలు అంద‌జేయ‌డంతో ఒక అంకం ముగిసింది. విష్ణు ఎప్పుడు నామినేష‌న్ వేస్తారో తెలియ‌రాలేదు. విష్ణు త‌ర‌ఫున మోహ‌న్‌బాబు నటీన‌టులంద‌రికీ ఫోన్‌చేసి మాట్లాడుతున్నారు. చిరంజీవి వ‌ర్గం త‌మ‌వైపే ఉంద‌ని ప్ర‌కాష్‌రాజ్ బృందం చెబుతోంటే, చిరంజీవి త‌న‌కే ఓటు వేస్తార‌ని విష్ణు చెబుతున్నారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాట‌ల యుద్ధం కూడా జ‌రుగుతోంది. రాజ‌కీయ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జ‌ర‌గ‌బోతోన్న ఈ ఎన్నిక‌ల‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: