గోవింద‌రాజులుగా సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై  వేంకటేశ్వరుడు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దుర్గా నవరాత్రులలో భాగంగా జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో బుధ‌వారం ఉదయం  ఏడవ రోజు శ్రీనివాస స్వామి వారు గోవింద రాజుల అలంకారంలో భక్తులను దర్శనమిచ్చారు.వేంకటేశ్వర స్వామి వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో ఈ ఉత్సవ వేడక కనుల పండువగా జరిగింది. సూర్య ప్రభ వాహనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరోగ్య కారకుడిగా సూర్యభగవానుడ్ని ఆరాధించడం హిందూ సంప్రదాయం. తిరుమల శ్రీ వేంకటేశ్వ స్వామి వారు కూడా ఒక్కరోజు బ్రహ్మోత్సవం గా పిలవబడే రథసప్తమి రోజన తోలి వాహనం గా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శన మిస్తాడు. యావత్ ప్రకృతికి, జీవ రాశులకు చైతన్యాన్ని అందించే వ్యక్తిగా సూర్యుడ్ని కొలవడం ఆనవాయితీ. సూర్యుడ్ని సూర్య నారాయణ మూర్తిగా వ్యవహరించడంలో మహావిష్ణువుకు, సూర్యడికి ఉన్న అవినాభవ సంబంధం బహిర్గతమవుతుంది.
రాత్రి వేళ చంద్ర ప్రభ వాహనం
ఉదయం సూర్య ప్రభ వాహనం లోనూ, రాత్రి వేళ చంద్ర ప్రభ వాహనం లోనూ వేంకటేశ్వర స్వామివారు భక్తుల ఒకే రోజు దర్శనమిస్తారు. సూర్యుడి తేజస్సు వల్లే చంద్రుడు ప్రాకాశిస్తాడని, ఆయన వల్లే వృద్ధి చెందుతాడని పురాణ ప్రతీతి. దీనికి అనుగుణంగా శ్రీవెంకటేశ్వర విభుడు ఉదయం సూర్య ప్రభ వాహనంపై, తిరిగి చంద్ర ప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద‌జీయ‌ర్‌స్వామి, చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి కార్యనిర్వహణాధికారి కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: