క‌రోనా టీకా 100 కోట్ల డోసుల పంపిణీ అనేది భార‌త్‌కు ఒక మైలురాయి వంటిద‌ని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అద‌ర్ పూనావాలా అన్నారు. ఈ మైలురాయిని మ‌న‌దేశం చేరుకోవ‌డం వెన‌క ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కృషిదాగివుంద‌ని కొనియాడారు. నైతికంగాకానీ, మాన‌వ‌తా దృక్ప‌థంతోకానీ మ‌నం మాట్లాడుకోవాలంటే ముందు ఆఫ్రికా దేశాల‌కు టీకా స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అక్క‌డి జ‌నాభాలో క‌నీసం మూడుశాతం మందికి కూడా టీకాలు అంద‌లేద‌న్నారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం బూస్ట‌ర్ డోస్ గురించి మాట్లాడుతున్నార‌న్నారు. వ‌చ్చే ఏడాది మొద‌ట్లో బూస్ట‌ర్ డోస్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అద‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే వృద్ధుల‌కు, అనారోగ్యంతో బాధ‌ప‌డేవారికి మాత్ర‌మే బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని, యువ‌కుల‌కు అవ‌స‌రంలేద‌న్నారు. ప్ర‌పంచంలోని మిగ‌తా దేశాల ప్ర‌జ‌ల‌కు రెండు డోసులు అందిన త‌ర్వాత బూస్ట‌ర్ డోస్ గురించి యువ‌త ఆలోచించ‌వ‌చ్చ‌న్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం చివ‌ర‌కు రెండు డోసులు తీసుకున్న‌వారి సంఖ్య మ‌రింత‌గా పెరుగుతుంద‌న్నారు. అయినా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించే విష‌యంలో ప్ర‌జ‌లు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: